Home Movie News Happy Birthday MR. Box office

Happy Birthday MR. Box office

నాన్నేమో మెగాస్టార్, బాబాయి ఏమో పవర్ స్టార్ తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని కుటుంబం, అటువంటి కుటుంబం నుంచి తెరంగేట్రం చేస్తున్నాడంటే అభిమానుల్లోనే కాదు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి కూడా అంచనాలు తారాస్థాయి లో ఉంటాయి, అటువంటి అంచనాలతోటే మొదలయ్యింది మెగా పవర్ స్టార్ సినీ ప్రస్థానం…

హీరోగా కెరీర్ ప్రారంభించాక రెండవ చిత్రానికే ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసాడు రామ్ చరణ్. ఇది ఏ వారసత్వ హీరోకు దక్కని అరుదైన అదృష్టం. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు… తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఒక ప్రతిష్టాత్మక విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలామంది అగ్ర తారలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినప్పటికీ రెండవ సినిమాకే రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనత కుమారుడు రామ్ చరణ్ ద్వారా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి చిత్రం “చిరుత ” లోనే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” లోనే నటన పరంగా అంత ఇంప్రూవ్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.

రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేయటానికి గాని, హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి గాని తండ్రిగా చిరంజీవి చేసింది ఏమీ లేదు. “చిరంజీవి కొడుకు” అనే ఒక టాగ్ లైన్ తప్ప నిజానికి చిరంజీవి రామ్ చరణ్ కు ఇచ్చింది ఇంకేమీ లేదు. అయితే ఆ ట్యాగ్ లైన్ ఒక్కటే నాకు చాలు అంటూ…కోట్ల విలువ చేసే ఆ ట్యాగ్ లైన్ తో జనాన్ని , జగాన్ని జయించగలనని ప్రూవ్ చేశాడు ఈ మెగా వారసుడు.

చిరు పాత్రలతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని ఒక్కో మెట్టుగా మలుచుకుంటూ చిరంజీవి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన తీరు ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. దర్శక నిర్మాతల పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తూ అట్టడుగు స్థాయి నుండి అష్టైశ్వర్యాల స్థాయికి ఎదిగారు కాబట్టే చిరంజీవిలో గర్వం మచ్చుకైనా కనిపించదు. అలా నిగర్విగా నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని కొనసాగించిన చిరంజీవికి ఈమధ్యనే ‘గర్వం’ ఎక్కువయింది అనే టాక్ వినిపిస్తుంది నిజమే… తెలుగు చలన చిత్రరంగంలో అంచెలంచెలుగా ఎదిగి నిగర్విగా గుర్తింపు పొందిన చిరంజీవిలో ఇంత గర్వం పెరగటానికి కారణం ఏమిటి?.. కారకుడు ఎవరు ? అని వాకబు చేస్తే అందుకు కారకుడు, రామ్ చరణ్ అని తేలింది.

నిజమే…. ఎంత అణచుకున్నా అణచుకోలేనిది పుత్రోత్సాహము… పుత్రోత్సాహ జనితమైన గర్వం. ఏమీ సాధించలేని కొడుకులను చూసుకుని ఎగిరిపడే తండ్రులున్న ఈ లోకంలో రామ్ చరణ్ లాంటి సుపుత్రుడిని కన్న చిరంజీవిలో కించిత్ గర్వం తొంగి చూస్తే తప్పేంటి? అందుకే కొడుకు విజయాలను చూసుకొని మురిసిపోయే తండ్రిలో ఉండే సహజసిద్ధమైన గర్వమే చిరంజీవి లోనూ తొంగిచూస్తుంది.అలాంటి గర్వాన్ని తండ్రికి తన వంతు కానుకగా ఇస్తున్న రామ్ చరణ్ ను చూస్తే గర్వం కూడా సగర్వంగా ఫీల్ అవుతుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version